Advertisement

సినీజోష్ రివ్యూ: ఆపరేషన్ వాలెంటైన్

Fri 01st Mar 2024 02:04 PM
operation valentine  సినీజోష్ రివ్యూ: ఆపరేషన్ వాలెంటైన్
Cinejosh Review: Operation Valentine సినీజోష్ రివ్యూ: ఆపరేషన్ వాలెంటైన్
Advertisement

సినీజోష్ రివ్యూ: ఆపరేషన్ వాలెంటైన్ 

బ్యానర్: సోనీ పిక్చర్స్, గాడ్ బ్లెస్స్ ఎంటర్టైన్మెంట్, రెనసాన్స్ పిక్చర్స్ 

నటీనటులు: వరుణ్ తేజ్, మనిషి చిల్లర్, నవదీప్, రుహాణి శర్మ, మీర్ సర్వర్ 

మ్యూజిక్: మిక్కీ J మేయర్ 

సినిమాటోగ్రఫీ: హరి K వేదాంతం

ఎడిటింగ్: నవీన్ నూలి 

ప్రొడ్యూసర్స్: సందీప్ ముద్దా 

డైరెక్టర్: శక్తి ప్రతాప్ 

రిలీజ్ డేట్: 01-03 2024 

తొలిప్రేమ, ఫిదా వంటి ప్రేమ కథలతో ఘన విజయాలు సాధించినా వరుణ్ తేజ్ చూపు మాత్రం ఎప్పుడూ విభిన్న కథలవైపే ఉంటుంది. ఆ ప్రయత్నంలో అపజయాలెదురవుతున్నా అడుగు మాత్రం అటువైపే పడుతూ ఉంటుంది. అదే కోవలో తాను తాజాగా చేసిన ఏరియల్ యాక్షన్ ఫిలిం ఆపరేషన్ వాలెంటైన్. ఇదే జోనర్ లో హృతిక్ రోషన్ చేసిన ఫైటర్ ని ఈమధ్యే ప్రేక్షకులు చూసారు. అయితే అది పక్కా కమర్షియల్ గా తీసిన సినిమా కాగా.. వాణిజ్య అంశాలకు దూరంగా, వాస్తవికతకు దగ్గరగా ఇంట్రెస్టింగ్ ఆపరేషన్ తో వచ్చాడీ వాలెంటైన్

ఇటీవలే పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడై భర్త గా కొత్త జర్నీని స్టార్ట్ చేసిన వరుణ్ తేజ్ కి ఇప్పుడీ వాలెంటైన్ పరాజయాల భారాన్ని దించాడా.. విజయ మాధుర్యాన్ని పంచాడా.. అనేది చూద్దాం ఈ రివ్యూలో, ఈ సినిమా రిజల్ట్ లో..

ఆపరేషన్ వాలెంటైన్ స్టోరీ రివ్యూ:

భారతీయ వైమానిక దళంలో పని చేసే అర్జున్ రుద్ర దేవ్ (వరుణ్ తేజ్) ఏం జరిగినా చూసుకుందాం.. అంటూ మొండితనంతో ముందుకు వెళ్లే వ్యక్తి. అదే శాఖలో పని చేసే రాడార్ ఆఫీసర్ అహనా(మానుషి చిల్లర్) అతనితో ప్రేమలో ఉంటుంది. కానీ ఈ ప్రేమ కథ కొంతే.. సినిమాలో పరిమితమంతే. ఓ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నించిన రుద్ర కి రివర్స్ స్ట్రోక్ తగులుతుంది. ఆపై అసలైన ఆపరేషన్ వాలెంటైన్ కోసం రంగంలోకి దిగిన రుద్ర చెలరేగిన తీరు, ప్రాజెక్ట్ వజ్ర వైనం తెరపై చూస్తేనే బావుంటుంది. నిజానికిది సినిమా కాదు. వాస్తవంగా జరిగిన వార్ తాలూకు పలు సంఘటనల సమాహారం. 2019 లో జరిగిన ఉగ్రవాదుల పుల్వామా ఎటాక్ నుంచి మన భారత వైమానిక దళం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ వరకు చాలా విషయాలు విశేషాలు, రహస్యాలు తెరపైకి తీసుకొచ్చిన ప్రయత్నం ఆపరేషన్ వాలెంటైన్. అందుకే ఇది కథగా కాసింతే అనిపించొచ్చు. స్క్రీన్ పై మాత్రం చూసేంత స్టఫ్ ఉంది.

ఆపరేషన్ వాలెంటైన్ స్క్రీన్ ప్లే రివ్యూ:

ఈ దర్శకుడికి ఇది తొలి చిత్రమేనా అని ఆశ్చర్యపోయేంత పట్టుతో, పట్టుదలతో రాసుకున్న కథనమిది. ప్రాజెక్ట్ వజ్ర అనే టాపిక్ తో స్టోరీ స్టార్ట్ చేసిన దర్శకుడు శక్తి అక్కడనుంచి వాస్తవిక సంఘటనలని వాడిగా, వేడిగా చూపిస్తూ ఆపరేషన్ వాలెంటైన్ లోకి ప్రేక్షకులని లీనం చేసేసాడు. ఇండియా - పాకిస్తాన్ మధ్య వైరం జోలికి పోకుండానే అనివార్యంగా జరుగుతున్న వార్ సన్నివేశాలని, సందర్భాలని, సంఘటనలని సాధ్యమైనంత సహజంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా పుల్వామా దాడి సన్నివేశాలు మనలోని దేశభక్తిని తట్టి లేపుతాయి. ఇంకొన్ని ఇంపార్టెంట్ సీన్స్ (ఇవి చూసి తీరాల్సినవే) అప్రయత్నంగా చప్పట్లు కొట్టేలా చేస్తాయి. గగనంలో జరిగే ఫైటర్ జెట్ల పోరాటాలు వీక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఏ లోపము లేని ప్రయత్నమే అయినా అనుకోకుండా తగిలిన శాపం ఏమిటంటే ఇదే రీతిలో, ఇదే బాటలో ఇటీవలే హృతిక్ రోషన్ లాంటి బడా బాలీవుడ్ స్టార్ చేసిన ఫైటర్ సినిమా రావడం, అప్రయత్నంగానే అందరిలోనూ ఆ రెండిటి మధ్య పోలిక కలగడం.!

ఆపరేషన్ వాలెంటైన్ ఎఫర్ట్స్ :

వరస పరాజయాలతో ఢీలాపడ్డ వరుణ్ తేజ్ కి వరంలా దొరికిన కథ ఇది. వాస్తవికతలోనే ఇటు హీరోయిజాన్ని, అటు తనలోని నటుడిని తెరపై పరిచే ఛాన్స్ దక్కించుకున్న వరుణ్ వంద శాతం తన బాధ్యత నిర్వర్తించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా తన ఆహార్యం ఆ పాత్రకు సరిగ్గా సూటైతే.. యాక్టర్ గా తన సిన్సియారిటీ స్క్రీన్ పై స్పష్టంగా రిఫ్లెక్ట్ అయ్యింది. మొత్తానికి రుద్రగా తనదైన ముద్ర వేసాడు వరుణ్. మిస్ వరల్డ్ మనిషి చిల్లర్ తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి రోల్ నే దక్కించుకుని ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించింది. ఇక నవదీప్, రుహని శర్మ ఇతర తారాగణం బాగానే ఉన్నప్పటికీ అన్నీ అవసరానికి తగ్గ పాత్రలే. అందరివీ అందుకు తగ్గ అభినయాలే. 

మరిక సాంకేతిక నిపుణుల విషయానికొస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. దర్శకుడు శక్తి ప్రతాప్ గురించే. అతని హార్డ్ వర్క్, హానెస్టీ ఫలితమే ఆపరేషన్ వాలెంటైన్. నేరుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులనే తన సిన్సియర్ స్క్రిప్ట్ తో మెప్పించిన శక్తి ప్రతాప్ వారి నుంచే మరింత విలువైన సమాచారాన్ని పొందడం విశేషం. అంతేకాదు, అదే నిజాయితీని తాను చేస్తున్న పనిలో అణువణువునా చూపిస్తూ, తెరపై మనం అనుక్షణం చూసేలా చేస్తూ తన శక్తి సామర్ధ్యాలను చూపించాడు. మిక్కీ జే మేయర్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో కాస్త నిరాశపరిచినా రెండు పాటలతో మాత్రం ఓకె అనిపించుకున్నాడు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు దేశభక్తిని ప్రేరేపించడానికి దోహదపడ్డాయి. నవీన్ నూలి ఎడిటింగ్ లో ఇంకాస్త షార్ప్ గా ట్రై చేసుంటే, డబ్బింగ్ వైజ్ డైరెక్టర్ ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే ఆపరేషన్ వాలెంటైన్ అవుట్ ఫుట్ మరికాస్త బావుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ కి మాత్రం వంక పెట్టలేం. లిమిటెడ్ బడ్జెట్ లోనే ఆ స్థాయి విజువల్స్ ని వీక్షకులముందుకు తీసుకువచ్చిన ఆపరేషన్ వాలెంటైన్ టీమ్ కి అభినందనలు.

ఆపరేషన్ వాలెంటైన్ ప్లస్ పాయింట్స్:

మెయిన్ థాట్

మెయిన్ ప్లాట్ 

మెయిన్ లీడ్

ఆపరేషన్ వాలెంటైన్ మైనస్ పాయింట్స్ : 

నో కమర్షియలిటీ 

నో ఎంటర్టైన్మెంట్ 

ఆపరేషన్ వాలెంటైన్ ఎనాలసిస్:

ఆపరేషన్ వాలెంటైన్ వంటి సినిమాలు అవార్డుల రేసులో పోటీపడొచ్చు. ఫిలిం ఫెస్టివల్స్ లో హవా చూపించొచ్చు. రేపనే రోజున ఓటిటీ ప్లాట్ ఫామ్ కి రాగానే ఓ రేంజ్ రెస్పాన్స్ ఉండొచ్చు. కానీ బాక్సాఫీసు వద్ద సందడి చేస్తాయా అన్నదే సందేహం. అందుకు నేడు కనిపిస్తున్న ప్రారంభ వసూళ్లే నిదర్శనం. చూద్దాం.. హానెస్ట్ గా, సిన్సియర్ గా సినిమా చేసిన ఆపరేషన్ వాలెంటైన్ టీమ్ కి కలెక్షన్స్ వైజ్ ఆ పరేషాన్  కలగకూడదనే ఆశిద్దాం. 

సినీజోష్ పంచ్ లైన్ : దర్శకుడి వజ్ర సంకల్పం 

సినీజోష్ రేటింగ్: 2.75/5

Cinejosh Review: Operation Valentine :

Operation Valentine Movie Telugu Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement